(ఈనాడు) పోలీసు శాఖ పనితీరు భూవివాదాల్లో తలదూర్చడం, బెదిరింపులకు పాల్పడటం, అవినీతి వంటివి దాటిపోయి అత్యాచారాల వరకూ దిగజారింది. ఎస్పీ, కమిషనర్లను సైతం కిందిస్థాయి సిబ్బంది లెక్క చేయడం లేదు. దీనికి కారణం రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న ధీమానే.

ఒకప్పుడు అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడితే శాఖాపరమైన చర్యలు తీసుకునేవారు. ఇందుకోసం పోలీసు శాఖలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ముఖ్యంగా స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తూ ఉంటారు. వీటి ఆధారంగా ఎవరైనా అధికారి ప్రవర్తన శ్రుతి మించుతోందని గ్రహిస్తే వారిని బదిలీ చేయడం, కొంత కాలం పక్కన పెట్టడం, అంతర్గత విచారణ చేపట్టడం చేసేవారు. వీటితో తమను గమనిస్తున్నారన్న భయం ప్రతి సిబ్బందిలోనూ ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.

— ఉదాహరణకు ఒక విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారికి చెందిన స్థలాన్ని కబ్జా చేసిన వ్యవహారంలో ఎస్సై కృష్ణపై హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేయాలని ఎంత ప్రయత్నించినా దొరకలేదు. నగర శివార్లలోని ఓ ఎమ్మెల్యే అతనికి ఆశ్రయం కల్పించారని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి చేశారని తేలింది. 

— ఈ మధ్యకాలంలో చాలామంది ఎస్పీ స్థాయి అధికారుల పనితీరు కూడా విమర్శలకు దారితీస్తోంది. నేతల అండతో కావలసిన చోట పోస్టింగ్‌ దక్కించుకొని విధుల నిర్వహణ గాలికొదిలేస్తున్నారు. ఉదాహరణకు ఒక ఎస్పీ క్యాంప్‌ కార్యాలయానికే పరిమితమై, కార్యాలయం మొహం కూడా చూడరని పోలీసు శాఖలో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన వరుసగా మూడు మంచి పోస్టింగులు దక్కించుకున్నారు.

— ఇక ఎస్సై భవానీసేన్‌పై గతంలోనూ లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా దీనిపై పెద్దఎత్తున చర్చ కూడా జరిగింది. స్పెషల్‌ బ్రాంచి నివేదికలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదని వినికిడి. 

— నారాయణపేట జిల్లా ఊట్కూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో భూవివాదం కారణంగా దాయాదుల మధ్య గొడవ మొదలైంది. ‘కొట్టి చంపుతున్నారు.. కాపాడండి’ అంటూ బాధితులు డయల్‌-100కు ఫోన్‌ చేశారు. ఎస్సై బిజ్జ శ్రీనివాసులు మాత్రం స్పందించలేదు. దాదాపు 4 గంటల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా, అప్పటికే ఓ వ్యక్తి మరణించారు. 

— భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌ తుపాకీతో బెదిరించి మరీ మహిళా హెడ్‌కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ చరిత్ర ఆయనకు ఉంది.

— హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. గతంలోనూ ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోక పోగా, కీలకమైన కేసుల బాధ్యతలు అప్పగించారు. ఇదే సీసీఎస్‌లో సీఐ సుధాకర్‌ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
 
— ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పోలీసుశాఖకు మాయని మచ్చలా మారింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు అరెస్టు కాగా, విశ్రాంత ఐజీ స్థాయి అధికారి కీలక నిందితుడిగా ఉన్నారు. చివరకు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్‌ చేసినట్లు నిందితులు ఒప్పుకోవడం సంచలనంగా మారింది. ఎన్నికల సందర్భంగా ఒక ఎస్పీ స్థాయి అధికారే స్వయంగా డబ్బు తరలింపునకు ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశారని దర్యాప్తులో వెల్లడైంది.
 
— విశ్రాంత ఐఏఎస్‌ అధికారి భన్వర్‌లాల్‌ ఇంటి కబ్జా కేసులో ఐపీఎస్‌ అధికారి నవీన్‌పై బంజారా హిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీఎస్‌ పోలీసులు ఆయన్ను విచారించి వాంగ్మూలం నమోదు చేశారు.

పోలీసుశాఖలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బదిలీల్లో విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని, స్థిరాస్తి వ్యాపారుల నుంచి మామూళ్లు దండుకుంటున్నారని పేరున్న ఒకరిద్దరు ఎస్పీలను అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చింది. ఎస్సై భవానీసేన్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Tags

Categories

Wait, does the nav block sit on the footer for this theme? That’s bold.

Where the mind is without fear

Explore the style variations available. Go to Styles > Browse styles.