ఈనాడు 14 June 2024: తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 200కి పైగా మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సచివాలయం, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, కలెక్టరేట్లు, జిల్లా, సబ్ రిజిస్ట్రార్, రవాణా, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.
బిహార్, కేరళల్లో నిర్వహిస్తున్న ఈ తరహా క్యాంటీన్లపై పంచాయతీరాజ్ అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదించారు. దీనికి అనుగుణంగా మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
మొదటి దశలో ఒక్కో జిల్లాలో అయిదు నుంచి పది వరకు క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలను స్థానిక గ్రామైక్య సంఘాలకు అప్పగిస్తారు. క్యాంటీన్ల నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు.
మహిళాశక్తి క్యాంటీన్లన్నింటినీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాతో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు వివిధ ఆకృతులను తయారు చేసి, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించి ఆమోదం తీసుకోనున్నారు.
వీటి ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు క్యాంటీన్ల పనివేళలు, ఏయే ఆహార పదార్థాలుండాలి అన్న అంశంపై పంచాయతీరాజ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రధానంగా తెలంగాణ వంటలు, పిండి పదార్థాలకు చోటు కల్పిస్తారు. కార్యాలయాల పనివేళలకు అనుగుణంగా ఇవి నడుస్తాయి. క్యాంటీన్లకు షెడ్లు అవసరమైతే, ప్రభుత్వ ఆధ్వర్యంలో వేయిస్తారు. వంట సామగ్రి, యంత్రాలను సబ్సిడీపై అందిస్తారు.
మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పంచాయతీరాజ్, రెవెన్యూ, దేవాదాయ, వైద్యారోగ్య, పర్యాటక అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం క్యాంటీన్ల ఏర్పాటుపై అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్‌ను ఆదేశించారు.