ఈనాడు, 12 June 2024

బ్యారేజీల నిర్మాణాల విషయంలో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తోందని కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ వ్యాఖ్యానించారు. లోపం ఎక్కడుంది… ఏం జరిగిందన్న విషయం తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామన్నారు. ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌ బీఆర్కే భవన్‌లోని కమిషన్‌ కార్యాలయంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

‘‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బాధ్యతలను పర్యవేక్షించిన ఇంజినీర్ల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మూడింటి సమాచారాన్ని తెలుసుకున్నాం. విచారణకు హాజరవుతున్న వారంతా ఈ నెల 25లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించాం. బ్యారేజీల్లో చోటుచేసుకున్న సంఘటనలు, తెలిసిన అంశాలను అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని ఇప్పటికే చెప్పాం. ఎవరైనా తప్పుడు అఫిడవిట్‌ సమర్పించినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సోమ, మంగళవారాల్లో ఇంజినీర్ల విచారణ జరిగింది. ఇక నిర్మాణ సంస్థల ప్రతినిధులను పిలుస్తాం’’ అని వివరించారు. 

బ్యారేజీలు సరైన రీతిలో ఉంటే లాభమే

నిర్మించిన బ్యారేజీలు సరైన రీతిలో ఉంటే ప్రజలకు లాభమే తప్ప నష్టం ఉండదని జస్టిస్‌ పీసీ ఘోష్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఏవో తప్పుడు లెక్కలతోనే ఇలా జరిగినట్లు అనిపిస్తోందన్నారు. విచారణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారుల ప్రమేయం ఉన్నట్లు గుర్తిస్తే వారికి కూడా నోటీసులు జారీ చేస్తాం. ఇతరుల వద్ద ఏదైనా సమాచారముంటే అఫిడవిట్‌ రూపంలో సమర్పించవచ్చు’’ అని సూచించారు.

విచారణకు 18 మంది ఇంజినీర్లు… 

మంగళవారం విచారణకు 18 మంది ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారితోపాటు గతంలో ఆయా విభాగాల్లో పనిచేసిన వారిని కూడా కమిషన్‌ పిలిచింది. ఈఎన్సీ (ఓఅండ్‌ఎం) నాగేంద్రరావు, ఎస్‌డీఎస్‌ఓ విభాగం నుంచి సీఈ ప్రమీల, ఎస్‌ఈ మురళీకృష్ణ, క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి సంబంధించి గతంలో సీఈగా పనిచేసిన వెంకటేశ్వర్లు, ఎస్‌ఈగా పనిచేసి ప్రస్తుతం సంగారెడ్డి సర్కిల్‌ సీఈగా ఉన్న అజయ్‌కుమార్, ప్రస్తుత సీఈ వెంకటకృష్ణ, మేడిగడ్డ బ్యారేజీ సీఈ సుధాకర్‌రెడ్డి, గతంలో ఎస్‌ఈగా పనిచేసి ఇప్పుడు మహబూబ్‌నగర్‌ సీఈగా ఉన్న రమణారెడ్డి హాజరయ్యారు. ఎస్‌ఈలు దేవేందర్‌రెడ్డి, కరుణాకర్, ఈఈలు రఘురాం, విష్ణుప్రసాద్, మల్లికార్జున ప్రసాద్, తిరుపతిరావు, ఓంకార్‌ సింగ్‌ తదితరులు సైతం హాజరైన వారిలో ఉన్నారు. నిర్మాణాలను ఏవిధంగా చేపట్టారు… నమూనాలు, కట్టడాల విధానంతోపాటు ఆ సమయంలో గుర్తించిన లోపాలపై విచారణ సాగినట్లు తెలిసింది. ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన వివరాలతోపాటు తెలిసిన అంశాలపై కమిషన్‌ విచారణ చేసినట్లు సమాచారం. 

నేడు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పిలుపు

కమిషన్‌ బుధవారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన గుత్తేదారు సంస్థల ప్రతినిధులను విచారించనుంది. ఎల్‌అండ్‌టీ, నవయుగ, అప్కాన్‌ సంస్థలకు చెందిన వారితోపాటు మొత్తం 20 మందిని విచారణకు పిలిచినట్లు తెలిసింది.

Tags

Categories

Wait, does the nav block sit on the footer for this theme? That’s bold.

Where the mind is without fear

Explore the style variations available. Go to Styles > Browse styles.