(ఈనాడు) ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోంది. మొత్తం 351 కిలోమీటర్ల పొడవున రెండు భాగాలుగా ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తున్నాయి. దీని నిర్మాణంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భాగస్వామిగా ఉంది. ఈమేరకు ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తు మూడేళ్ల నుంచి జరుగుతున్నప్పటికీ తుదిరూపం దాల్చలేదు. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా భరించాలని గతంలోనే నిర్ణయించాయి. నిర్మాణ వ్యయాన్ని మాత్రం కేంద్రమే పూర్తిగా భరిస్తుంది. ఈ మేరకు రెండు ప్రభుత్వాలూ అప్పట్లోనే అవగాహనకు వచ్చాయి. అయితే, ప్రతిపాదిత రోడ్డు మార్గంలో ఉన్న వివిధ రకాల తీగలు, పైపులైన్లు, విద్యుత్తు స్తంభాలు తదితరాలను తరలించేందుకయ్యే వ్యయం విషయంలో కేంద్రం, మునుపటి రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఈ ఖర్చులను రాష్ట్రమే భరించాలని కేంద్రం, సాధ్యం కాదని రాష్ట్రం పట్టుదలతో వ్యవహరించాయి. ఫలితంగా ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణమే ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రంలో 2023 డిసెంబరులో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టేంత వరకు, అంటే, సుమారు ఏడాదికి పైగా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిల్లీ వెళ్లి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి యుటిలిటీస్ తరలింపు ఖర్చులను భరించేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. దాంతో పాటు సీఎస్ ద్వారా అధికారిక లేఖను సైతం పంపడంతో ఆర్‌ఆర్‌ఆర్‌లో కదలిక వచ్చింది.
భాగస్వామ్య పక్షాల మధ్య అవగాహన ఒప్పందం కోసం జాతీయ రహదారుల సంస్థ గత ఏడాది సెప్టెంబరులోనే కసరత్తు చేపట్టింది. అవసరమైన పత్రాలన్నీ సిద్ధం చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. యుటిలిటీస్ తరలింపు విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. ఖర్చులను భరించేందుకు ఇటీవల రాష్ట్రం ముందుకు రావడంతో ఒప్పందం చేసుకునేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. జులైలో ఒప్పందానికి సంబంధించిన తుది నివేదికలను సిద్ధం చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు.