కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని తెలంగాణ డిప్యూటీ సీ.ఎం. భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించనుంది. ఈ క్రమంలో భారాస, భాజపా నాయకులు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది. సింగరేణి అంటే ఉద్యోగాల గని. ఆ సంస్థ తెలంగాణకే తలమానికం. రాష్ట్రంలో 40 బొగ్గు గనుల్లో ఉత్పత్తి జరుగుతోంది. 2030 కల్లా వాటిలో 22 మూతపడతాయి. ఇప్పుడున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి 15 టన్నులకు పడిపోనుంది. కొత్త బొగ్గు గనులను సంపాదించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుంది.”
దేశంలో ఉన్న బొగ్గు గనులను ప్రభుత్వ సంస్థలకు దక్కకుండా చేయాలని భాజపా చట్టం తీసుకొచ్చింది. బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలని చట్టం చేసింది. దానికి భారాస పార్లమెంటు సభ్యులు కూడా మద్దతు తెలిపారు. వీళ్లు ఇవాళ తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. గతంలో సింగరేణి పక్కనున్న బొగ్గు బావులకు వేలం పాట నిర్వహిస్తుంటే వాటిని తీసుకోవద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారికి కావాల్సిన వారి కంపెనీలకు లబ్ధి కలగాలనే ఆ నిర్ణయం తీసుకున్నారు. పక్క రాష్ట్రం ఒడిశాలో బిడ్ వేయడానికి పంపించారు.
ప్రస్తుతం శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తోంది. ఆ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలుస్తాం. సింగరేణిని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రధానిని కలుస్తాం. బొగ్గు నిల్వలు తగ్గిపోతే సింగరేణి వ్యవస్థను నమ్ముకున్న వేలాది కుటుంబాలు అన్యాయానికి గురవుతాయి’’ అని భట్టి అన్నారు.
సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా కుట్ర: కేటీఆర్
సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
“ఒడిశాలో రెండు గనులను వేలం లేకుండా నైవేలీ లిగ్నెట్‌కు అప్పగించారు. అలాగే గుజరాత్లో రెండు ప్రభుత్వ రంగ సంస్థలకు 2015లో వేలం లేకుండానే నేరుగా నాలుగు గనులు కేటాయించారు. తమిళనాడులో కూడా బొగ్గు గనులను వేలం నుంచి మినహాయించాలని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై కేంద్ర మంత్రిని కోరారు.”
“విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్లే నష్టాల్లోకి వెళ్లింది. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్ల అనే గనిని క్యాప్టివ్ మైన్ కింద కేటాయించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే కేంద్రం ఇవ్వలేదు. ఆప్షన్లో అదానీకి అప్పగించింది. సొంత గనిలేకపోవడంతో నష్టాల్లోకి వెళ్లిన విశాఖ ఉక్కును అమ్మాలని చూశారు. ఇప్పడు సింగరేణి విషయంలో కూడా అదే విధమైన వ్యూహం అలవంబించబోతున్నారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది.
“2021 డిసెంబరు 11 నాడు సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించాలని డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి వైఖరి ఎందుకు మారింది? వేలంలో పాల్గొంటామని ఇప్పుడు చెబుతున్నారు. తెలంగాణలోని బొగ్గు గనులు వేలం వేయకుండా ఇప్పటి వరకు భారాస రక్షణ కవచంలా నిలిచింది’’ అని కేటీఆర్ అన్నారు.
బొగ్గు గనులను వేలం ద్వారానే కేటాయించాలని సుప్రీం కోర్టు తీర్పు: కిషన్ రెడ్డి
సింగరేణి ప్రైవేటీకరణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. 2018 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసీఆర్ సింగరేణి ప్రైవేటీకరణ అంటూ విషప్రచారంచేశారు తప్ప, అందులో నిజం లేదన్నారు. దిల్లీలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. దేశంలోని ఏ ప్రభుత్వరంగ బొగ్గు సంస్థనూ తాము ప్రైవేటీకరణ చేయబోమన్నారు.
‘‘బొగ్గు గనులను వేలం ద్వారానే కేటాయించాలని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానివల్లే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తొమ్మిది రౌండ్ల వేలం నిర్వహించి.. 300 గనులను వేలం వేసింది. ఈ నెల 21న పదో రౌండ్ వేలం హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకే ఆదాయం వస్తుంది. బొగ్గు, గనుల వేలం కారణంగా ఒడిశా ప్రభుత్వానికి ఏటా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తోంది.
బొగ్గు గనులను తనకు ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవడానికే మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ వేలాన్ని వ్యతిరేకించారు. అందుకే వేలంలో పాల్గొనవద్దని సింగరేణిని ఆదేశించారు. అయితే ఈసారి సింగరేణి ద్వారా వేలంలో పాల్గొంటామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మా శాఖ పూర్వ మంత్రి ప్రహ్లాద్‌జోషీకి చెప్పారు. దానివల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తుంది.
సింగరేణికి సాయం విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయబోదు. ఆ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉంది కనుక రోజువారీ పరిపాలనాధికారాలన్నీ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి. ఎండీని వాళ్లే నియమిస్తారు. కేంద్ర జోక్యం 1% కూడా ఉండదు.
సింగరేణిని కేంద్ర ప్రభుత్వం ప్రైటీకరిస్తోందని కేసీఆర్ ఇదివరకు అసత్యాలు ప్రచారం చేశారు. మెజార్టీ వాటా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పుడు కేంద్రం దాన్ని ఎలా ప్రైవేటీకరించగలుగుతుంది? దేశంలోని 12 ప్రభుత్వరంగ సంస్థల్లో దేన్నీ ప్రైవేటీకరించిన దాఖలా లేదు. సింగరేణి ప్రైవేటీకరణ జరగదని 100% భరోసా ఇస్తున్నా.
బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యత చాలా తక్కువ. దాని ఆధారంగా స్టీల్‌ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నాలుగు కమిటీలు చెప్పాయి. అలాంటప్పుడు ఉక్కు కర్మాగారం ఎలా పెడతాం? బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంటు కడుతుందని కేసీఆర్ 2018 ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లలో ఎందుకు కట్టలేదో ఆయన చెప్పాలి.