విద్యుత్‌ కొనుగోలు విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లామని మాజీ సీఎం కేసీఆర్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు వివరణ ఇచ్చారు. అలాగే, మీరు కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని కేసీఆర్‌ ఆయనను కోరారు. తెలంగాణలో విద్యుత్‌ కొనుగోళ్ల అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి  ఇటీవల నోటీసులు ఇచ్చారు. జూన్‌ 15 (నేడు) లోపు వివరణ ఇవ్వాలన్నారు. దానికి సమాధానంగా కేసీఆర్‌ 12 పేజీల లేఖ పంపించారు. “రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్‌ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయే పరిస్థితి ఉండేది. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల హాలిడే ప్రకటించేవారు”, అని లేఖలో పేర్కొన్నారు.

– “విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89%, ఏపీకి 46.11% విద్యుత్ కేటాయించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏ మాత్రం సరిపోదు. తెలంగాణ వచ్చే నాటికి 5,000 మెగావాట్ల కొరతతో రాష్ట్ర విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో 20,000 మెగావాట్లకు పైగా తీసుకెళ్లాం.”

– “ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి అభ్యంతరాలు చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేసింది. ఈఆర్సీ నిర్ణయాలపై రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఆనాడే ఎలక్ట్రిసిటీ అపిలేటు ట్రిబ్యునల్, సుప్రీంకోర్టును ఆశ్రయించే వారు. కానీ ఎలాంటి అప్పీల్‌కు వెళ్లలేదు”

– ఈఆర్సీ తీర్పులపై ఎంక్వైరీలు, కమిషన్లు వేయకూడదన్న కనీస జ్ఞానం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందని కేసీఆర్ లేఖలో అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరూ(జస్టిస్ నరసింహారెడ్డి) ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకపోవడం విచారకరమన్నారు. మీరు అన్ని అంశాలను పరిశీలించకుండా నాపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తప్పుపడుతూ అభ్యంతరాలను తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

– 2014 నాటికి సబ్ క్రిటికల్‌పై ఎలాంటి నిషేధం లేదు. 12 వ పంచవర్ష ప్రణాళిక కూడా సబ్ క్రిటికల్ ధర్మల్ ప్లాంట్ నిర్మించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టి తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చట్టబద్ధంగా అనుమతులు తీసుకునే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ ప్రారంభించామని కేసీఆర్ లేఖలో వివరించారు.

“విలేకర్ల సమావేశంలో కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిగ్గుతేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించట్లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. మేం చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకొని వైదొలగితే మంచిది. మీరు కమిషన్‌ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా,” అని కేసీఆర్‌ తెలిపారు.

విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి మాటలు ఎంతో బాధ కలిగించాయని కేసీఆర్ అన్నారు. జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు పంపుదామని అనుకున్నా. కానీ ఈలోపే మీరు ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా నా పేరు ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే ఏదో దయతలచి ఇచ్చినట్లు మాట్లాడటం చాలా బాధ కలిగించింది. మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్లుగా మీ మాటలు ఉన్నాయి. విచారణ నిష్పక్షపాతంగా కనిపించడం లేదు. నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోంది. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నరసింహారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో విజ్ఞప్తి చేశారు.

16 June 2024: లేఖ అంశంపై మీడియాతో మాట్లాడిన జస్టిస్ నరసింహా రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ పంపిన లేఖ తమకు అందిందన్నారు. కేసీఆర్ తన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారన్నారు. ఛత్తీస్‌గఢ్ పవర్ పర్చేస్, భద్రాద్రి యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అంశాల్లోని కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారన్నారు. కేసీఆర్ చెప్పిన విషయాలను నిపుణుల కమిటీతో చర్చించాల్సి ఉందన్నారు. లెటర్‌లో కేసీఆర్ చెప్పిన అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఎవరికైనా తమ అభిప్రాయాలను నిస్సందేహంగా చెప్పే స్వేచ్ఛ ఉంటుందన్నారు.

కేసీఆర్ తెలిపిన అభ్యంతరాలపై పునఃపరిశీలన జరుపుతామని జస్టిస్ నరసింహా రెడ్డి అన్నారు. జరిగిన పరిణామాలను మాత్రమే తాను మీడియా ముందు వివరించానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరి అభ్యంతరాలు వారికి ఉండటం సహజం అన్నారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు, వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందని చెప్పారు. వాస్తవాలు ఏంటనేదానిపై BHEL ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతామని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ పంపిన లెటర్‌పై మంగళవారం నాడు విశ్లేషణ జరుపుతామని.. దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు.

Tags

Categories

Wait, does the nav block sit on the footer for this theme? That’s bold.

Where the mind is without fear

Explore the style variations available. Go to Styles > Browse styles.